రామదాసు : నగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగమహోదయం శ్రీ నగజాతనయం॥
శ్రీరామభక్తులారా ! ఇది సీతాకల్యాణ సత్కథ. నలభై రోజులనుంచి చెప్పిన కథ. చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్రసౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తూంది. నాయనా ! కాస్త పాలు, మిరియాలు ఏమన్నా?
చిత్తం – సిద్ధం.
భక్తులారా ! సీతామహా దేవి స్వయంవరానికి ముల్లో కాలనుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి ... ఆహా ! అతడెవరయ్యా అంటే
శబాష్ శబాష్ ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షమునుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో
ఎంత సొగసుగాడే, మన సింతలోనె దోచినాడే మోము కలువరేడే నా నోము ఫలము వీడే శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనకమహీపతి సభాసదులను చూచి, అనియె నిట్లు -
ఓ యనఘులారా ! నా అనుగుపుత్రి సీత వినయాదిక సద్గుణవ్రాత, ముఖవిజిత లలిత జలజాత ముక్కంటి విఁటి నెక్కిడజాలిన యెక్కటి జోదును నేడు మక్కువమిూరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు.
అని యీ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే, సభలోనివారందరూ ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా 'హా' ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము' అని అనుకొనినవాడై వెనుదిరిగిపోయాడట.
తదనంతరంబున
ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరపువలె నిల్చి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి సరమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత మదనవిరోధి శరాసనమును తన శరమును బూనినయంత ఫెళ్లుమనె విల్లు - గంటలు ఘల్లుమనె - గుభిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె జానకి దేహము ఒక నిమేషమ్మునందె నయము జయమును భయము విస్మయము గదుర శ్రీమద్రమారమణ గోవిందో హరి!
భక్తులందరూ చాలా నిద్రావస్థలో వున్నట్లుగా వుంది. మరొక్కసారి - జై శ్రీమద్రమారమణ గోవిందో హారి
భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు. అంతట భూతలనాధుడు - రాముడు ప్రీతుండై - పెండ్లియాడె, పుధుగుణమణి సంఘాతన్ – భాగ్యో పేతన్ సీతన్ భూతలనాధుడు - రాముడు ప్రీతుండై - పెండ్లియాడె.. శ్రీమద్రమారమణ గోవిందో హారి